1 కొరింథీయులకు 13:1-10

1 కొరింథీయులకు 13:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను. నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే. నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు. ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు. ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది. ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది. ఎందుకంటే మనకు తెలిసింది కొంచెమే, మనం ప్రవచించేది కొంతవరకే. కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి.

1 కొరింథీయులకు 13:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు. అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు. ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది. ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి.

1 కొరింథీయులకు 13:1-10 పవిత్ర బైబిల్ (TERV)

ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి. నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము. ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు. దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు. ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది. దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నశించి పోదు. ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.

1 కొరింథీయులకు 13:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అప కారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

1 కొరింథీయులకు 13:1-10

1 కొరింథీయులకు 13:1-10 TELUBSI1 కొరింథీయులకు 13:1-10 TELUBSI1 కొరింథీయులకు 13:1-10 TELUBSI