1 కొరింథీయులకు 12:1-11
1 కొరింథీయులకు 12:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు. అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని, ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు. ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.
1 కొరింథీయులకు 12:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు. అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు. దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
1 కొరింథీయులకు 12:1-11 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు. దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు. దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
1 కొరింథీయులకు 12:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము లను మరియొకనికి అద్భుతకార్యములనుచేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.