1 కొరింథీయులకు 1:27-31

1 కొరింథీయులకు 1:27-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నాడు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి, ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు. కనుక, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి” అని వ్రాయబడి ఉంది.

1 కొరింథీయులకు 1:27-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం. అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

1 కొరింథీయులకు 1:27-31 పవిత్ర బైబిల్ (TERV)

కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”

1 కొరింథీయులకు 1:27-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. –అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

1 కొరింథీయులకు 1:27-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు. ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు. కాబట్టి, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి” అని వ్రాయబడి ఉంది.