1 కొరింథీయులకు 1:1-17

1 కొరింథీయులకు 1:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు, క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కాబట్టి, మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు. కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు. తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు. నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా? నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును! స్తెఫెను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.

1 కొరింథీయులకు 1:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు, కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక. క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి. సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను. క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

1 కొరింథీయులకు 1:1-17 పవిత్ర బైబిల్ (TERV)

దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొస్తెనేసు నుండి. కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగు గాక! మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించు గాక! యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు. సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయె కుటుంబం నాకు తెలియ చేసింది. నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నాను” అని, ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను కేఫాను అనుసరిస్తున్నాను” అని, నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపై చనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా? నేను క్రిస్పుకు, గాయికి తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు. ఔను, నేను స్తెఫను కుటుంబానికి చెందినవాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు. ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.

1 కొరింథీయులకు 1:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుని చిత్తమువలన యేసుక్రీస్తుయొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి; గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు–నేను పౌలు వాడను, ఒకడు–నేను అపొల్లోవాడను, మరియొకడు– నేను కేఫావాడను, ఇంకొకడు–నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యములేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.