1 దినవృత్తాంతములు 9:1-34

1 దినవృత్తాంతములు 9:1-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు. తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు. అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు. ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో ఊతైయూ ఉన్నాడు. ఊతైయూ అమీహూదు కొడుకు. అమీహూదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరెసు వంశం వాడు. పెరెసు యూదా కొడుకు. షిలోనీ వాళ్ళలో పెద్దవాడు ఆశాయా, అతని సంతానమూ, జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు. ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ, యెరోహాము కొడుకైన ఇబ్నెయా, మిక్రి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నీయా కొడుకైన రగూవేలుకి పుట్టిన షెఫట్యా కొడుకైన మెషుల్లామూ ఉన్నారు. వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు. యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు. అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు. అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు. యెరోహాము పషూరు కొడుకు. పసూరు మల్కీయా కొడుకు. ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు. అదీయేలు యహజేరా కొడుకు. యహజేరా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు. మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు. వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న ఒక వెయ్యీ ఏడు వందల అరవై మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్ధులు. ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు. షెమయా హష్షూబు కొడుకు. హష్షూబు అజ్రీకాము కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు. హషబ్యా మెరారి వంశం వాడు. బక్బక్కరూ, హెరెషూ, గాలాలూ, వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు. మత్తన్యా మీకా కొడుకు. మీకా జిఖ్రీ కొడుకు. జిఖ్రీ ఆసాపు కొడుకు. ఇంకా ఓబద్యా ఉన్నాడు. ఈ ఓబద్యా షెమయా కొడుకు. షెమయా గాలాలు కొడుకు. గాలాలు యెదూతోను కొడుకు. నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు. ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వీళ్ళ బంధువులూ ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు. లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజ ద్వారానికి కాపలా కాసేవాళ్ళు. కోరహు కొడుకైన ఎబ్యాసాపుకి పుట్టిన కోరే కొడుకైన షల్లూము అతని బంధువులూ, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులూ మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు. గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మెషెలెమ్యా కొడుకైన జెకర్యా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు. ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు. వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు. ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు. గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు. అయితే లేవీయులైన నలుగురు ప్రముఖ ద్వారపాలకులు మిగిలిన వాళ్ళపై అజమాయిషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులనూ, ఖజానాలనూ భద్రపరచే బాధ్యత వాళ్ళదే. వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి. వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు. మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు. యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధద్రవ్యాలను, పరిమళ తైలాన్నీ తయారు చేస్తారు. అర్పణల కోసం రొట్టెను తయారుచేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూముకి పెద్ద కొడుకు. వాళ్ళ బంధువులైన కహాతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది. గాయకులూ లేవీయుల వంశ నాయకులూ పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా సేవ చేయాలి. వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా, పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు.

1 దినవృత్తాంతములు 9:1-34 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది. మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు. యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా: అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు. యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు. యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు. మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు. యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు. యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు. యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను, మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి. యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు. యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే. యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజ్రీకాము. అజ్రీకాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు. యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు. తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు. షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు. గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు. పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి. పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు. ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు. వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే. దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినపుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు. మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు. కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది. నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు. విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు. లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు. ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.

1 దినవృత్తాంతములు 9:1-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలోమునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును. యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు. షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును. జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది, బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులును తమతమ వంశముల పట్టీల చొప్పున తొమ్మిదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమపితరుల వంశములనుబట్టి తమపితరులయిండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను, దేవుని మందిరములో అధిపతియైన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా; మల్కీయా కుమారుడగు పషూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై. మరియు తమపితరులయిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా, యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసుమునుపు వారిమీద అధికారియైయుండెను, యెహోవా అతనితోకూడ నుండెను. మరియు మెషె లెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి. గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడ బడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను. గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారి వారియొద్దకు వచ్చుటకద్దు. లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపనివారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొని పోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్దకుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను. వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతిదినమున సముఖపు రొట్టెలు సిద్ధముచేయుపని కలిగియుండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగి యున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి. వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.

1 దినవృత్తాంతములు 9:1-34 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు. తమ సొంత పట్టణాల్లో తమ స్వాస్థ్యంలో మొదట నివసించిన వారెవరంటే, కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు: యూదా కుమారుడైన పెరెసు వారసుడు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడైన అమీహూదు పుట్టిన ఊతై. షేలానీయుల నుండి: మొదట కుమారుడైన అశాయా, అతని కుమారులు. జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది. బెన్యామీనీయుల నుండి: హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు; యెరోహాము కుమారుడైన ఇబ్నియా; మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా; ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము. తమ వంశావళి ప్రకారం బెన్యామీను నుండి ప్రజలు మొత్తం 956 మంది. వీరందరు తమ తమ కుటుంబాలకు పెద్దలు. యాజకుల నుండి: యెదాయా; యెహోయారీబు; యాకీను; అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి; మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా; ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై; తమ కుటుంబాలకు పెద్దలుగా ఉన్న యాజకుల సంఖ్య 1,760. వారు దేవుని మందిరంలో సేవలు అందించే బాధ్యత కలిగిన సమర్థులు. లేవీయుల నుండి: మెరారీయుడైన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా; బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా; ఎల్కానాకు పుట్టిన ఆసా కుమారుడైన బెరెక్యా; ఇతడు నెటోపాతీయుల గ్రామాల్లో నివసించాడు. ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద. వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు. కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు. పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు. మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు. ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు. వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు. ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు. వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు. అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది. వారు దేవుని ఆలయానికి కావలివారు కాబట్టి దాని దగ్గరే రాత్రంతా ఉండేవారు; ప్రతి ఉదయం దాని తలుపులు తెరిచే బాధ్యత వారిదే. వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు. ఇతరులకు ఉపకరణాలు, పరిశుద్ధాలయంలో ఉన్న ఇతర వస్తువులన్నిటి బాధ్యత ఇవ్వబడింది. వాటితో పాటు సన్నని పిండి, ద్రాక్షరసం, ఒలీవనూనె, ధూపద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు వారి ఆధీనంలోనే ఉంటాయి. అయితే యాజకులలో కొంతమంది సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చేసేవారు. కోరహు వంశీయుడైన షల్లూము మొదటి కుమారుడైన మత్తిత్యా అనే లేవీయుడు నమ్మకమైనవాడు కాబట్టి అతనికి అర్పణల రొట్టెలు తయారుచేసే బాధ్యత ఇవ్వబడింది. వారి తోటి లేవీయులైన కహాతీయులలో కొందరికి ప్రతి సబ్బాతు దినం కోసం బల్లపై ఉంచే రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఇవ్వబడింది. లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు. వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.