1 దినవృత్తాంతములు 4:9-10
1 దినవృత్తాంతములు 4:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను” అని చెప్పింది. ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు. “నువ్వు నన్ను కచ్చితంగా ఆశీర్వదించు. నా భూభాగాన్ని విశాలం చెయ్యి. నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు.” దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు.
1 దినవృత్తాంతములు 4:9-10 పవిత్ర బైబిల్ (TERV)
యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
1 దినవృత్తాంతములు 4:9-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను.
1 దినవృత్తాంతములు 4:9-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యబ్బేజు తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.