1 దినవృత్తాంతములు 29:21-30

1 దినవృత్తాంతములు 29:21-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు. ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు. యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు. అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు. రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి. అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.

1 దినవృత్తాంతములు 29:21-30 పవిత్ర బైబిల్ (TERV)

ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు. ఆ రోజు ప్రజలంతా బాగా తిని, త్రాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు. వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సాదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు. తరువాత సొలొమోను యెహోవా నియమించిన సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు. పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు. యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు. దావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు రాజుగా వున్నాడు. దావీదు యెష్షయి కుమారుడు. దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాలించాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు. దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు. రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి. ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.

1 దినవృత్తాంతములు 29:21-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతోకూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. ఆ దినమునవారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి. అధిపతులందరును యోధులందరునురాజైన దావీదు కుమారులందరునురాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదుటను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముది మిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

1 దినవృత్తాంతములు 29:21-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మరుసటిరోజు వారు యెహోవాకు అర్పణలు ఇచ్చి దహనబలులు అర్పించారు: వెయ్యి ఎద్దులు, వెయ్యి పొట్టేళ్లు, వెయ్యి మగ గొర్రెపిల్లలు, వాటితో పాటు పానార్పణలను ఇశ్రాయేలీయులందరి పక్షాన సరిపడా ఇతర బలులు అర్పించారు. ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు. కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు. అధిపతులందరు, యుద్ధ వీరులందరు, రాజైన దావీదు కుమారులందరు, సొలొమోను రాజుకు విధేయత చూపించారు. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట ఎంతో ఉన్నతంగా చేసి, అతనికి ముందున్న ఇశ్రాయేలీయుల రాజులలో ఏ రాజుకు కలగని రాజ వైభవాన్ని అతనికి ప్రసాదించారు. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు అంటే హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు దీర్ఘకాలం జీవించి ఐశ్వర్యాన్ని ఘనతను పొంది మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. అతని స్థానంలో అతని కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.