1 దినవృత్తాంతములు 2:1-55
1 దినవృత్తాంతములు 2:1-55 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు. తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు. పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు. జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు. ఏతాను కొడుకు పేరు అజర్యా. హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై. రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు. బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు. యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా, నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి, ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు. వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు. హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు. హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు. తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు. సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి. వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం. హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి. హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు. ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి. యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు. ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు. నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు. అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు. షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు. యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు. షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు. అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు. జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు. ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు. అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు. ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు. షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు. యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను. హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు. షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి. కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు. యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది. ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా. ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు. వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే. కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు. శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ. యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.
1 దినవృత్తాంతములు 2:1-55 పవిత్ర బైబిల్ (TERV)
రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు. ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ. ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు. యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద. జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను. ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు. ఏతాను కుమారుడు అజర్యా. హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై. రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు. నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి. యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ). నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి. యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు. సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబుట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు. అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు. హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు. అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు. ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు. పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను. సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి. కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి. హెస్రోను కాలేబుదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ. యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము. యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు. షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు. సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు. అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి. షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు. పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా. షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా. షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి. అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు ఎప్లాలు. ఎప్లాలు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము. షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా. యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు. షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు. కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు. యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు. మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు. మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా. ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము. తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు. శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం: మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు. శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ – రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.
1 దినవృత్తాంతములు 2:1-55 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు. యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. పెరెసు కుమారులు హెస్రోను హామూలు. జెరహు కుమారులు అయిదుగురు, జిమ్రీ ఏతాను హేమాను కల్కోలు దార. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్దైయెన నయస్సోనును కనెను. నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు. అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను. మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు. అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను, షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను; యెతెరు సంతానములేకుండ చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలేగాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను, జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను, ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను, అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను, ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను, షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ. షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానును మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను. యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు. కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును, బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును. కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి. శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.
1 దినవృత్తాంతములు 2:1-55 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన బత్-షుయ కుమార్తెకు జన్మించారు. యూదాకు మొదటి కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడ్డవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన వానిని చంపారు. యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు. యూదా కుమారులందరు మొత్తం అయిదుగురు. పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు. జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. వీరు అయిదుగురు. కర్మీ కుమారుడు: ఆకారు, అతడు ప్రత్యేకపరచబడిన వాటిని ముట్టకూడదని నిషేధించబడిన కొన్నిటిని తీసుకుని ఇశ్రాయేలుకు బాధను తీసుకువచ్చాడు. ఏతాను కుమారుడు: అజర్యా. హెస్రోనుకు జన్మించిన కుమారులు: యెరహ్మెయేలు, రాము, కాలేబు. రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు. నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారులు: మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షిమ్యా, నాలుగవవాడు నెతనేలు, అయిదవవాడు రద్దయి, ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు. సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు. అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు: యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు. హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు. తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు. సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి. (అయితే గెషూరు, అరాము, హవ్వోత్ యాయీరును, కెనాతును దానికి చెందిన పట్టణాలను మొత్తం అరవై పట్టణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.) వీరందరు గిలాదు తండ్రియైన మాకీరు సంతానము. కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు. హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి వాడైన రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా. యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి. యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు. అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు. నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు. అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి. షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు. యోనాతాను కుమారులు: పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలు సంతానము. షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు. షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు. అత్తయి కుమారుడు నాతాను, నాతాను కుమారుడు జాబాదు, జాబాదు కుమారుడు ఎప్లాలు, ఎప్లాలు కుమారుడు ఓబేదు, ఓబేదు కుమారుడు యెహు, యెహు కుమారుడు అజర్యా, అజర్యా కుమారుడు హేలెస్సు, హేలెస్సు కుమారుడు ఎల్యాశా, ఎల్యాశా కుమారుడు సిస్మాయీ, సిస్మాయీ కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు యెకమ్యా, యెకమ్యా కుమారుడు ఎలీషామా. యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు: మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా, హెబ్రోను తండ్రియైన మారేషా. హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు. కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు. యహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షయపు. కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా. ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా. వీరు కాలేబు సంతానము. ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు: కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు, బేత్లెహేము తండ్రియైన శల్మా, బేత్-గాదేరు తండ్రియైన హారేపు. కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది, కిర్యత్-యారీము వంశస్థులు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వీరినుండి సొరాతీయులు, ఎష్తాయులీయులు వచ్చారు. శల్మా వారసులు: బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు, యబ్బేజులో నివసించే లేఖికుల వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.