1 దినవృత్తాంతములు 10:1-14
1 దినవృత్తాంతములు 10:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు. ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు. సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు. అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో “నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు” అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు. సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు. ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు. తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు. తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు. ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది. అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు. సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.
1 దినవృత్తాంతములు 10:1-14 పవిత్ర బైబిల్ (TERV)
ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు. అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.” కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు. సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు. లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు. శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు. ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు. సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను గుడిలో వేలాడదీసారు. యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు. యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు. సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు. యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.
1 దినవృత్తాంతములు 10:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు–ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను. సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను. ఆప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి. జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి. హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చిపడియుండుట చూచి అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధములను తీసికొనిపోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు వినినప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి, సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సింధూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచములయొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.
1 దినవృత్తాంతములు 10:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు, చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీ-షూవలను చంపేశారు. సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు. సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు. ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు. సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఇంటివారందరు ఒకేసారి చనిపోయారు. సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు. మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని కుమారులను చూశారు. వారు అతన్ని దోచుకుని అతని తలను, అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు. వారు అతని ఆయుధాలను తమ దేవుళ్ళ గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో వ్రేలాడదీశారు. ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు, వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు. యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు. యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.