రోమా పత్రిక 4:9-25

రోమా పత్రిక 4:9-25 OTSA

ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా. ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు. అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు. అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు. కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి. “నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను” అని వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయినవారికి జీవమిచ్చేవారు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవారు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి. “నీ సంతానం అలా ఉంటుంది” అని అతనితో చెప్పినప్పుడు అబ్రాహాము నిరీక్షణలేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు, అందుకే అతడు అనేక జనాలకు తండ్రి అయ్యాడు. తనకు వంద సంవత్సరాల వయస్సు కాబట్టి తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికీ అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు. అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు. అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.” “అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు, మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మన కోసం కూడా ఆ వాక్యం వ్రాయబడింది. యేసు క్రీస్తు మన పాపాల కోసం మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.

రోమా పత్రిక 4:9-25 కోసం వీడియో