రోమా పత్రిక 15:1-16

రోమా పత్రిక 15:1-16 OTSA

బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.” అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.” మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.” పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక. నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను. అయినా నేను కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుచేయాలని చాలా ధైర్యంగా మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.

రోమా పత్రిక 15:1-16 కోసం వీడియో