ప్రకటన 1:1-20

ప్రకటన 1:1-20 OTSA

త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు. అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు. సమయం సమీపంగా ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు. యోహాను, ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది: గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు రానున్నవాడైన దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి, తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్. “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్. “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు. యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి వెనుకకు తిరిగాను. నేను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను. ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను. జీవించేవాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడూ ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా ఆధీనంలోనే ఉన్నాయి. “కాబట్టి నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తర్వాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు. నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.

Read ప్రకటన 1

ప్రకటన 1:1-20 కోసం వీడియో