కీర్తనలు 96:1-10

కీర్తనలు 96:1-10 OTSA

యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి. యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి. దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి. యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు. ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృజించారు. వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి. ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి. యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి. “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.