కీర్తనలు 89:1-18

కీర్తనలు 89:1-18 OTSA

యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; నా నోటితో మీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను. మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని, మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను. “నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను, నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను. ‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. సెలా యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి, అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది. అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు? పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు; తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు. సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది. పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; అలలను మీరు అణచివేస్తారు. చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును నలగ్గొట్టారు; మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది. ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే; లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు. ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు; తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి. మీ బాహువు శక్తి కలది; మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది. నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి. యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు. రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు; మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు. ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, మీ దయతో మా కొమ్మును హెచ్చిస్తారు. నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.