నా ప్రజలారా! నా ఉపదేశం వినండి;
నా నోటి మాటలు వినండి.
నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను;
పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.
మనం విన్నవి మనకు తెలిసినవి
మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను.
వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;
యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను,
ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి
తర్వాతి తరానికి మేము చెప్తాం.
ఆయన యాకోబుకు చట్టాలు విధించారు
ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు,
వారి పిల్లలకు దానిని బోధించుమని
మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.
తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు,
ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు,
వారు వారి పిల్లలకు బోధిస్తారు.
అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు
ఆయన కార్యాలను మరచిపోరు
ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.
వారు తమ పితరుల్లా అనగా
మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను,
దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను
ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు.
ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ,
యుద్ధ దినాన వెనుకకు తిరిగారు;
వారు దేవుని నిబంధనను పాటించలేదు,
ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు.
వారు ఆయన చేసిన కార్యాలు,
ఆయన వారికి చూపిన అద్భుతాలను మరచిపోయారు.
ఆయన వారి పూర్వికుల ఎదుట
ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు.
ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు;
ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు.
పగలు మేఘస్తంభమై,
రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు.
అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు.
సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు.
ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు
నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.
కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు
అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు.
తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ
వారు ఉద్దేశపూర్వకంగా దేవున్ని పరీక్షించారు.
వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు;
వారు, “ఈ ఎడారిలో దేవుడు
మనకు భోజనం సరఫరా చేయగలడా?
నిజమే, ఆయన బండరాయిని కొట్టారు,
నీరు బయటకు వచ్చింది,
ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి,
కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా?
ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.
యెహోవా వారి మాట విని కోపగించారు;
ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది,
ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది.
ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు.
ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.
అయినా ఆయన పైనున్న ఆకాశాలను
ఆకాశద్వారాలు తెరిచారు.
తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు.
పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు.
మానవులు దేవదూతల ఆహారం తిన్నారు;
ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు.
ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు.
తన శక్తితో దక్షిణ గాలి విసిరేలా చేశారు.
ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని,
సముద్రపు ఇసుక రేణువుల్లా పక్షుల్ని వారి మీద కుమ్మరించారు.
ఆయన వాటిని వారి దండులో
వారి గుడారాల చుట్టూ వంగేలా చేశారు.
వారడిగిందే దేవుడిచ్చాడు,
వారు కడుపునిండా తిన్నారు.
కానీ వారి ఆశ తీరకముందే,
ఇంకా ఆహారం వారి నోటిలో ఉండగానే,
దేవుని కోపం వారి మీదికి రగులుకొంది;
వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు,
ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు.
ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు;
ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.
అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా
వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.
దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు;
వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.
దేవుడు తమకు కొండ అని,
సర్వోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు.
అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ
తమ నాలుకలతో ఆయనకు అబద్ధాలు చెప్పారు;
వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు,
వారు ఆయన నిబంధన పట్ల నమ్మకంగా లేరు.
అయినా దేవుడు దయ చూపించి;
వారి పాపాలను క్షమించారు
వారిని నాశనం చేయలేదు.
మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు
ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.
వారు కేవలం శరీరులే అని,
విసరి వెళ్లి మరలి రాని గాలి లాంటి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.