కీర్తనలు 37:30-40

కీర్తనలు 37:30-40 OTSA

నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు. దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు. కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు. యెహోవాయందు నిరీక్షణ ఉంచి ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని వారసత్వంగా పొందేలా ఆయన నిన్ను హెచ్చిస్తారు; దుష్టులు నాశనమైనప్పుడు నీవు చూస్తావు. నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు. కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు. నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది. కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు. నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట. యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.