కీర్తనలు 31:19-24

కీర్తనలు 31:19-24 OTSA

మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది! మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు. యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు. “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు. యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు. యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.