కీర్తనలు 22:22-31

కీర్తనలు 22:22-31 OTSA

నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను. యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి. బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు. మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను. దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి. భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి. రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు. ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు. వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!