కీర్తనలు 20:1-7

కీర్తనలు 20:1-7 OTSA

కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక. తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి. మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మీ దహనబలులను అంగీకరించాలి. సెలా ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి. యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి. యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు. కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.