మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి,
ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.
నా శ్రమలో నా ఆదరణ ఇదే:
మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు,
కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను.
యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి,
వాటిలో నాకెంతో ఆదరణ.
మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి,
నాకు చాలా కోపం వస్తుంది.
నేను ఎక్కడ బస చేసినా
మీ శాసనాలే నా పాటల సారాంశము.
యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి
రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.
నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను
ఇది నాకు అభ్యాసంగా ఉన్నది.
యెహోవా, మీరే నా వాటా;
మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను.
నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను;
మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి.
నేను నా మార్గాలను గమనించి
నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.
మీ ఆజ్ఞలను అనుసరించడానికి
నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.
దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా,
నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను.
మీ నీతిగల న్యాయవిధులను బట్టి
మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.
మీకు భయపడేవారందరికి,
మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను.
యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది;
మీ శాసనాలు నాకు బోధించండి.
యెహోవా, మీ మాట ప్రకారం
మీ సేవకునికి మేలు చేయండి.
నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను,
నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.
నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను,
కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.
మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు;
మీ శాసనాలు నాకు బోధించండి.
అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ,
నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.
వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి,
కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.
నాకు బాధ కలగడం మేలైంది
తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
వేలాది వెండి బంగారు నాణేలకంటే
మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.
మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి;
మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి.
మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక,
ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను.
యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు,
నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.
మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం,
మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.
నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి,
మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము.
కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక;
కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.
మీకు భయపడేవారు,
మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక.
నేను అవమానానికి గురి కాకుండ,
మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను.
మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది;
కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను.
మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి;
“మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.
నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా,
నేను మీ శాసనాలను మరువను.
మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు?
నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు?
అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా,
నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి;
నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి.
వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు,
అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు.
మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి,
తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను.
యెహోవా! మీ వాక్కు శాశ్వతం;
అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది.
మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది.
మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి,
ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి.
ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే,
నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని.
నేను మీ కట్టడలు ఎన్నడు మరువను,
ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.
నేను మీ వాడను, నన్ను రక్షించండి;
నేను మీ కట్టడలను వెదికాను.
దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు,
కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.
సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి!
కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.
ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో!
నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి
నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.
నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి
నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.
నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి
వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను.
మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని
చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను.
నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు,
ఎందుకంటే మీరే నాకు బోధించారు.
మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం,
అవి తేనెకంటె తియ్యనివి!
మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను;
కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము.