కీర్తనలు 119:145-160

కీర్తనలు 119:145-160 OTSA

యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను. నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం. మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి.