సామెతలు 8:1-36

సామెతలు 8:1-36 OTSA

జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది; పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది: మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను. అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి. వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి. నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు. నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి. వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి. జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు. “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము. ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే. నా వలననే రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు; పాలకులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు. నా వలననే రాజకుమారులు ఏలుతారు, నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను. ఐశ్వర్యం, గౌరవం, స్ధిరమైన ఆస్తి, నీతి నా దగ్గర ఉన్నాయి. మేలిమి బంగారముకంటెను నా వలన కలిగే ఫలం మంచిది; శ్రేష్ఠమైన వెండికంటెను నా వలన కలిగే లాభం గొప్పది. నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను. “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు; మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను. ప్రవహించే కాలువలు లేనప్పుడు నీళ్లతో నిండి ఉన్న నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని. దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని. దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు, నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు. నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను, దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు. నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు. నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు; నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు.”

Read సామెతలు 8