ఫిలిప్పీ పత్రిక 1:1-18

ఫిలిప్పీ పత్రిక 1:1-18 OTSA

క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి, క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పరిశుద్ధులకు, సంఘ అధ్యక్షులకు, సంఘ పరిచారకులకు వ్రాయుట: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి, మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు. దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను. సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది. నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు. కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను.