లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను అధికారులను గద్దించి, “దేవుని మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?” అని అడిగాను. తర్వాత నేను వారందరిని ఒక్క దగ్గరికి పిలిచి వారిని వారి స్థానాల్లో మరలా నియమించాను.
యూదా ప్రజలందరు ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో పదవ వంతులను గిడ్డంగులకు తెచ్చారు. యాజకుడైన షెలెమ్యా, శాస్త్రియైన సాదోకు, లేవీయుడైన పెదాయాలను గిడ్డంగుల మీద అధికారులుగా నియమించాను. అలాగే వారికి సహాయంగా జక్కూరు కుమారుడును, మత్తన్యా మనుమడునైన హానానును నియమించాను ఎందుకంటే వీరంతా నమ్మకస్థులుగా పేరు పొందారు. తమ తోటి లేవీయులకు ఆహారం పంచి ఇవ్వాల్సిన బాధ్యత అప్పగించబడింది.
నా దేవా, వీటిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా దేవుని మందిరం కోసం దాని సేవల కోసం నేను నమ్మకంగా చేసిన వాటిని తుడిచివేయకండి.
ఆ రోజుల్లో యూదాలో కొంతమంది విశ్రాంతి దినాన ద్రాక్షలను ద్రాక్షగానుగలో తొక్కడం, ధాన్యం, ద్రాక్షరసం, ద్రాక్షలు, అంజూర పండ్లు అన్ని రకాల మూటలు తీసుకువచ్చి గాడిదల మీద పెట్టి విశ్రాంతి దినాన యెరూషలేముకు తీసుకురావడం నేను చూశాను. కాబట్టి ఆ రోజు ఆహారం అమ్మకూడదని నేను వారిని హెచ్చరించాను. యెరూషలేములో నివసిస్తున్న తూరుకు చెందిన ప్రజలు చేపలు, అన్ని రకాల సరుకులు తీసుకువచ్చి విశ్రాంతి దినాన యూదాలోని ప్రజలకు అమ్ముతున్నారు. అందుకు నేను యూదా సంస్థానాధిపతులను మందలించి, “సబ్బాతు దినాన్ని అపవిత్రం చేస్తూ మీరు చేస్తున్న ఈ చెడ్డ పని ఏమిటి? మీ పూర్వికులు ఇలా చేసినందుకే మన దేవుడు మన మీదికి, ఈ పట్టణం మీదికి ఈ విపత్తు రప్పించలేదా? మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదికి కోపాన్ని మరింతగా రప్పిస్తున్నారు.”
సబ్బాతుకు ముందు రోజు యెరూషలేము గుమ్మాలపై సాయంకాలపు నీడలు పడగానే యెరూషలేము తలుపులు మూసివేసి విశ్రాంతి దినం గడిచేవరకు తలుపులు తెరవకూడదని నేను ఆజ్ఞాపించాను. సబ్బాతు దినాన ఏ బరువులు లోపలికి రాకుండా నా మనుష్యుల్లో కొందరిని కాపలా ఉంచాను. వ్యాపారులు, రకరకాల వస్తువులు అమ్మేవారు ఒకటి రెండు సార్లు యెరూషలేము బయట రాత్రంతా గడిపారు. అయితే నేను వెళ్లి వారిని గద్దించి, “మీరు రాత్రంతా గోడ దగ్గర ఎందుకు ఉన్నారు? మరోసారి ఇలా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను” అని చెప్పాను. అప్పటినుండి వారు మళ్ళీ విశ్రాంతి దినాన రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వెళ్లి గుమ్మాలను కనిపెట్టుకుని ఉండాలని లేవీయులను ఆజ్ఞాపించాను.
నా దేవా, వీటిని బట్టి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి! మీ మహా ప్రేమను బట్టి నా మీద దయ చూపించండి.
అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను. వారి పిల్లల్లో సగం మంది అష్డోదు భాషను గాని పరాయి ప్రజల భాషను గాని మాట్లాడేవారు కాని యూదా భాషలో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు. నేను వారిని గద్దించి శపించాను. ఆ పురుషులలో కొంతమందిని కొట్టి వారి జుట్టు పెరికించాను. నేను వారితో దేవుని పేరిట ప్రమాణం చేయించి, “మీరు మీ కుమార్తెలకు వారి కుమారులతో పెళ్ళి చేయకూడదు, వారి కుమార్తెలతో మీరు మీ కుమారులు పెళ్ళి చేసుకోకూడదు. ఇలాంటి పెళ్ళిళ్ళను బట్టి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక దేశాల్లో అతని వంటి రాజు మరొకడు లేడు. అతడు తన దేవునిచే ప్రేమించబడి దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు కాని యూదేతరుల స్త్రీలు అతనిచేత పాపం చేయించారు. ఈ ఘోరమైన చెడునంతా చేస్తూ యూదేతరుల స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉండి పాపం చేస్తున్న మీలాంటి వారి మాటలు మేము వినాలా?” అన్నాను.
ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడు. అతన్ని నా దగ్గర నుండి దూరంగా వెళ్లగొట్టాను.
నా దేవా! వారు యాజకత్వ వృత్తిని, యాజక నిబంధనలను, లేవీయుల నిబంధనను అపవిత్రం చేశారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి.
కాబట్టి యాజకులు లేవీయులు ఏ విదేశీయులతో కలిసిపోకుండ వారిని శుద్ధి చేసి వారిలో ప్రతి ఒక్కరికి వారి సొంత పనిని అప్పగించాను. నేను నిర్ణీత సమయాల్లో కట్టెలు, ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను.