మార్కు సువార్త 8:11-30

మార్కు సువార్త 8:11-30 OTSA

పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు. అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు. తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు. శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోవడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు. యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు. వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేదా పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా? మీరు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా? నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు. “నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?” అని ఆయన వారిని అడిగారు. అందుకు వారు, “ఏడు” అని జవాబిచ్చారు. అప్పుడు ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా?” అన్నారు. వారు బేత్సయిదాకు వచ్చినప్పుడు, కొందరు ఒక గ్రుడ్డివానిని తీసుకువచ్చి వానిని ముట్టుమని ఆయనను బ్రతిమాలారు. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి, వాని కళ్ల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు. అందుకు వాడు తల పైకెత్తి చూస్తూ, “మనుష్యులు కనపడుతున్నారు, వారు చెట్లలా నడుస్తున్నారు” అని చెప్పాడు. యేసు మళ్ళీ తన చేతులు వాని కళ్ల మీద ఉంచారు. అప్పుడు వాని కళ్లు తెరువబడ్డాయి, వాడు చూపు పొందుకొని, అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడు. యేసు వానితో, “నీవు ఊరిలోనికి వెళ్లకుండా ఇంటికి వెళ్లు” అని చెప్పి వానిని పంపివేశారు. యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారు” అన్నారు. ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు. అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పకూడదని వారిని హెచ్చరించారు.