మార్కు సువార్త 15:16-33

మార్కు సువార్త 15:16-33 OTSA

సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు. వారు ఆయనకు ఊదా రంగు అంగీని వేసి, ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆ తర్వాత, “జయం, యూదుల రాజా!” అని ఆయనను పిలవడం మొదలుపెట్టారు. ఆయన తలపై కొమ్మతో పదే పదే కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేశారు. వారు ఆయన ముందు మోకరించి, ఆయనను అవమానిస్తూ నమస్కరించారు. ఈ విధంగా ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రాన్ని తీసివేసి, ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు. కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు. వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: యూదుల రాజు. తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమవైపున మరొకడిని సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా! సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.