మార్కు సువార్త 1:30-41

మార్కు సువార్త 1:30-41 OTSA

సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదిలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకున్నారు, వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కాబట్టి ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు. సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి, ఆయనను కనుగొని, “అందరు నీకోసం వెదకుతున్నారు!” అని చెప్పారు. అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు. కాబట్టి ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లమీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు.