మత్తయి సువార్త 26:1-13

మత్తయి సువార్త 26:1-13 OTSA

యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో, “మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు. వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. కాని పండుగ సమయంలో వద్దు, “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది. శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.