మత్తయి సువార్త 21:19-32

మత్తయి సువార్త 21:19-32 OTSA

అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూర చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు, కాబట్టి, “ఇకమీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూర చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు. యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, ఆయన బోధిస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ప్రజానాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగింది, పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?” అని వారిని అడిగారు. వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే, ప్రజలందరు యోహానును ప్రవక్త అని నమ్ముతున్నారు, కాబట్టి మనం వారికి భయపడుతున్నాం” అని తమలో తాము చర్చించుకొన్నారు. అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఈ పనులను చేస్తున్నానో మీతో చెప్పను” అన్నారు. యేసు వారితో ఇంకా మాట్లాడుతూ, “మీకు ఏమి అనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మొదటి వాని దగ్గరకు వెళ్లి, ‘కుమారుడా, వెళ్లి ఈ రోజు ద్రాక్షతోటలో పని చేయి’ అని చెప్పాడు. “అతడు, ‘నేను వెళ్లను’ అని జవాబు ఇచ్చాడు కాని తర్వాత మనస్సు మార్చుకొని వెళ్లాడు. “అప్పుడు ఆ తండ్రి రెండవ కుమారుని దగ్గరకు వెళ్లి, అదే విధంగా చెప్పాడు. అప్పుడు వాడు, ‘వెళ్తాను’ అని తండ్రితో చెప్పాడు కాని వెళ్లలేదు. “అయితే, ఈ ఇద్దరు కుమారులలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినవాడు?” అని యేసు వారిని అడిగారు. అందుకు వారు, “మొదటి వాడే” అన్నారు. అప్పుడు యేసు వారితో, “పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలాగంటే, యోహాను నీతి మార్గాన్ని చూపించడానికి మీ దగ్గరకు వచ్చాడు, కాని మీరు అతన్ని నమ్మలేదు, కాని పన్ను వసూలు చేసేవారు వేశ్యలు అతన్ని నమ్మారు. అది చూసిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపపడి ఆయనను నమ్మలేదు” అని చెప్పారు.