ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోకి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది. ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకుని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు. ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు. ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు. వారు, “అవును, ప్రభువా” అన్నారు. యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు. యేసు ఈ ఉపమానాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడినుండి వెళ్లి, తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్భుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు. అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.
చదువండి మత్తయి సువార్త 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి సువార్త 13:47-58
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు