మత్తయి సువార్త 13:36-46

మత్తయి సువార్త 13:36-46 OTSA

అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలం లోని కలుపు మొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు. అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు. ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు. “కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు. వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.