ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజ లాంటిది. అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.”
యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.”
యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి:
“నేను ఉపమానాలతో నా నోరు తెరుస్తాను.
సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలు నేను మాట్లాడతాను.”
అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలం లోని కలుపు మొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు.
అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు. ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు.
“కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు. వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.
ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోకి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది. ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకుని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు. ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు. ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు.
వారు, “అవును, ప్రభువా” అన్నారు.
యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.
యేసు ఈ ఉపమానాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడినుండి వెళ్లి, తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్భుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు.
అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.
వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.