లూకా సువార్త 8:40-53

లూకా సువార్త 8:40-53 OTSA

యేసు తిరిగి రాగానే, ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషంగా ఆయనను ఆహ్వానించారు. అప్పుడు యాయీరు అనే పేరుగల సమాజమందిరపు అధికారి వచ్చి, యేసు పాదాలపై పడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలాడు. ఎందుకంటే సుమారు పన్నెండేళ్ళ వయస్సుగల అతని ఏకైక కుమార్తె జబ్బుతో చనిపోయేలా ఉంది. యేసు అతనితో వెళ్తూ ఉండగా, ప్రజలు గుంపుగా ఆయనపై పడుతున్నారు. పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గాని, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. “నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు. మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు. అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతూ వచ్చి ఆయన కాళ్లమీద పడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది. అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు. యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు. వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు. ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు. ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కోసం ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, “ఏడ్పు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు.