లూకా సువార్త 4:1-32

లూకా సువార్త 4:1-32 OTSA

యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యొర్దానును విడిచి వెళ్లారు. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది. అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు; నీ పాదాలకు ఒక రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ ” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు. అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు. యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆయన వారి సమాజమందిరాల్లో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు. యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపుచుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది: “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించారు; చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి, గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి, ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.” ఆ తర్వాత ఆ గ్రంథపుచుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు. అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు. యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేశావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు. ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు సత్యమే చెప్తున్నాను. అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు. ఎలీషా అనే ఇంకొక ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశపు నయమాను తప్ప మరి ఎవరు శుద్ధి పొందలేదు” అని చెప్పారు. ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోప్పడ్డారు. వారు లేచి, ఆయనను పట్టణం నుండి బయటకు తరుముతూ, ఆ పట్టణం కట్టబడి ఉన్న కొండ అంచు మీదకు తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడద్రోయాలనుకొన్నారు. కానీ ఆయన జనసమూహం మధ్య నుండి నడుచుకుంటూ తన దారిన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన గలిలయలోని కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినాన ప్రజలకు బోధించారు. ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన మాటల్లో అధికారం ఉండింది.