లూకా సువార్త 18:31-42

లూకా సువార్త 18:31-42 OTSA

యేసు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి. వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు. వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కాబట్టి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు. యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. జనసమూహం వెళ్తుందని వాడు విని, “ఆ సందడేంటి?” అని అడిగాడు. “నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని వారు జవాబిచ్చారు. అందుకతడు బిగ్గరగా, “యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేశాడు. ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. “ప్రభువా, నాకు చూపు కావాలి!” అని వాడు అన్నాడు. యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు.