లూకా సువార్త 11:33-54

లూకా సువార్త 11:33-54 OTSA

“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు. యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. అయితే యేసు యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు. అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది. “పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది. “పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండడానికి, సంత వీధుల్లో గౌరవం అందుకోవడానికి ఇష్టపడుతున్నారు. “మీకు శ్రమ! మీరు సరిగా గుర్తుపట్టలేని సమాధుల్లా ఉన్నారు, తెలియక ప్రజలు వాటి మీద నడుస్తారు.” ధర్మశాస్త్ర నిపుణులలో ఒకడు, “బోధకుడా, నీవిలా చెప్పి, మమ్మల్ని అవమానపరుస్తున్నావు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, మీరు మోయలేని బరువులను ప్రజలతో మోయిస్తూ, కనీసం ఒక వ్రేలి మోతనైనా మోసి వారికి సహాయపడరు. “మీకు శ్రమ, ఎందుకంటే మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, కాని వారిని చంపింది మీ పితరులే. దీనిని బట్టి మీ పితరులు చేసిన వాటిని మీరు సమ్మతిస్తున్నట్లు సాక్ష్యమిస్తున్నారు; వారు ప్రవక్తలను చంపారు, మీరు వారికి సమాధులను కడుతున్నారు. ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’ కాబట్టి లోక ఆరంభం నుండి చిందించబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది, అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు. “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.” అక్కడినుండి యేసు బయటకు వెళ్లినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రశ్నలతో ఆయనను చిక్కులు పెట్టాలని, ఆయన చెప్పే మాటల్లో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు.