లేవీయ 14:1-20

లేవీయ 14:1-20 OTSA

యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి: యాజకుడు శిబిరం బయటకు వెళ్లి వారిని పరీక్షించాలి. ఒకవేళ వారు వారి అపవిత్ర చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందివుంటే, వారిని శుద్ధీకరించడానికి రెండు బ్రతికి ఉన్న పవిత్రమైన పక్షులు, కొంత దేవదారు కలప, ఎరుపురంగు నూలు, హిస్సోపును తీసుకురావాలని యాజకుడు ఆదేశించాలి. తర్వాత ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపుమని యాజకుడు ఆదేశించాలి. అప్పుడు యాజకుడు బ్రతికి ఉన్న పక్షిని పట్టుకుని, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకుని మంచినీటిపై చంపబడిన పక్షి రక్తంలో ముంచాలి. కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ పొందే వారిపై ఆ నీటిని ఏడుసార్లు చల్లి, అతడు ఏడుసార్లు చల్లి, వారిని పవిత్రులుగా ప్రకటించాలి. ఆ తర్వాత, యాజకుడు బ్రతికి ఉన్న మరొక పక్షిని బయట పొలాల్లోకి వదిలేయాలి. “శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి. ఏడవ రోజున వారు తమ వెంట్రుకలంతా క్షవరం చేయించుకోవాలి; గడ్డం, కనుబొమ్మలు ఇంకా మిగతా వెంట్రుకలు పూర్తిగా క్షవరం చేసుకోవాలి. అలాగే వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. “ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి. వారిని శుద్ధులుగా ప్రకటించే యాజకుడు శుద్ధీకరించబడిన వారిని, వారి అర్పణలతో పాటు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా ఎదుట కనుపరచాలి. “అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము. యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి. అప్పుడు యాజకుడు కొంచెం నూనె తీసుకుని, తన ఎడమచేతి అరచేతిలో పోసి, తన కుడి చూపుడు వ్రేలు తన అరచేతిలో ఉన్న నూనెలో ముంచి, తన వ్రేలితో దానిలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరిస్తాడు. యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి. యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెను శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలమీద పూసి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి. “అప్పుడు యాజకుడు అపవిత్రత పోగొట్టుకోవాలని వచ్చిన వారి కోసం పాపపరిహారబలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహనబలి పశువును వధించాలి. దానిని భోజనార్పణతో కలిపి బలిపీఠం మీద అర్పించి, వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, అప్పుడు వారు శుద్ధులవుతారు.