యెహోషువ 15:1-19

యెహోషువ 15:1-19 OTSA

యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది. వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది, అక్రబ్బీం కనుమకు దక్షిణంగా దాటి, సీను వరకు కొనసాగి, కాదేషు బర్నియాకు దక్షిణ వైపు వరకు వ్యాపించి ఉంది. తర్వాత అది హెస్రోను దాటి అద్దారు వరకు వెళ్లి కర్కా వైపు తిరిగింది. అది అజ్మోను గుండా ఈజిప్టు వాగులో చేరి, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. ఇది వారి దక్షిణ సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు మృత సముద్రం వెంట యొర్దాను నది యొక్క ముఖద్వారం వరకు విస్తరించింది. ఉత్తర సరిహద్దు యొర్దాను ముఖద్వారం దగ్గర సముద్రం యొక్క అఖాతం నుండి ప్రారంభమై, బేత్-హొగ్లా వరకు వెళ్లి, బేత్-అరాబాకు ఉత్తరాన రూబేను కుమారుడైన బోహాను రాయి వరకు కొనసాగింది. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది. ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది. కొండపై నుండి సరిహద్దు నెఫ్తోవ నీటి ఊటవైపు వెళ్లి, ఎఫ్రోను పర్వత పట్టణాల నుండి బాలా (అనగా కిర్యత్-యారీము) వైపుకు వెళ్లింది. తర్వాత ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు పర్వతానికి వంపుగా తిరిగి, యారీము పర్వతం (అంటే కెసాలోను) ఉత్తర వాలు గుండా వెళ్లింది, బేత్-షెమెషు వరకు కొనసాగి తిమ్నాకు వ్యాపించింది. అది ఎక్రోను ఉత్తర వాలుకు వెళ్లి, షిక్కెరోను వైపు తిరిగి, బాలా పర్వతాన్ని దాటి జబ్నీలుకు చేరుకుంది. సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము. ఇవి యూదా ప్రజల వంశాల ప్రకారం వారి సరిహద్దులు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.) కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు. అక్కడినుండి గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశాడు. కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు. కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు. అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు.