యోహాను సువార్త 8:37-59

యోహాను సువార్త 8:37-59 OTSA

మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కాబట్టి మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను. మీరు మీ తండ్రి దగ్గరి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు. దానికి వారు, “అబ్రాహాము మా తండ్రి” అని జవాబిచ్చారు. అందుకు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే మీరు అబ్రాహాము చేసిన వాటిని చేస్తారు. కాని నేను దేవుని నుండి విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. అబ్రాహాము అలాంటివి చేయలేదు. మీ సొంత తండ్రి చేసిన పనులనే మీరు చేస్తున్నారు” అని వారితో అన్నారు. అందుకు వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఉన్న ఏకైక తండ్రి దేవుడే” అని ఎదురు చెప్పారు. యేసు వారితో, “దేవుడు మీ తండ్రియైతే మీరు నన్ను ప్రేమించేవారు. ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండే ఇక్కడకు వచ్చాను. నా అంతట నేను రాలేదు; దేవుడే నన్ను పంపించారు. నా మాటలు మీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు. మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కాబట్టి వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి. అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా మీరు నన్ను నమ్మరు! నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు మీరెందుకు నన్ను నమ్మరు? దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలు వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు” అని అన్నారు. అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు. యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను. నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా ఘనత కోసం వెదకడం లేదు; కానీ ఘనత కోసం వెదికేవాడు ఉన్నాడు, ఆయనే న్యాయమూర్తి. నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరని నేను మీతో చెప్పేది నిజం” అని వారికి చెప్పారు. ఈ విధంగా చెప్పగానే యూదులు, “నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలిసింది! అబ్రాహాము, అలాగే ప్రవక్తలు కూడ చనిపోయారు, అయినా ‘నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరు’ అని నీవంటున్నావు. మా తండ్రియైన అబ్రాహాము కన్నా నీవు గొప్పవాడవా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నిన్ను నీవు ఎవరని అనుకుంటున్నావు?” అని అడిగారు. అందుకు యేసు, “నన్ను నేను ఘనపరచుకుంటే ఆ ఘనత వట్టిదే. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను ఘనపరుస్తున్నారు. మీకు ఆయన ఎవరో తెలియదు, కాని ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్తే నేను కూడా మీలాగే అబద్ధికుని అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు నేను ఆయన మాటకు లోబడతాను. మీ తండ్రియైన అబ్రాహాము నేనున్న రోజును చూడాలన్న ఆలోచనకే ఆనందించాడు; అతడు దాన్ని చూసి సంతోషించాడు” అని చెప్పారు. అందుకు యూదులు, “నీకు యాభై సంవత్సరాలు కూడ లేవు, నీవు అబ్రాహామును చూశావా!” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “అబ్రాహాము పుట్టక ముందే నేనున్నాను! అని నేను మీతో చెప్పేది నిజం” అన్నారు. అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్లు తీశారు. కానీ యేసు వారికి కనబడకుండ దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.