యోహాను సువార్త 8:1-20

యోహాను సువార్త 8:1-20 OTSA

అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు. ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు ప్రజలందరు ఆయన చుట్టూ చేరారు. ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి, వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు. యేసు మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ ఉన్నారు. వారు ఆపకుండా ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి, మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ ఉన్నారు. వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది. యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు. ఆమె, “అయ్యా ఎవరూ లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు. యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు. అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు; కాబట్టి నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు. యేసు జవాబిస్తూ, “నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం విలువైనదే, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు మానవ ప్రమాణాలను బట్టి తీర్పు తీరుస్తారు; కాని నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒంటరిగా లేను, నేను నన్ను పంపిన తండ్రితో ఉన్నాను కాబట్టి నేను తీర్పు తీర్చినా నా నిర్ణయాలు న్యాయమైనవే. ఇద్దరు మనుష్యుల సాక్ష్యం విలువైనదని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది. నేను నా గురించి సాక్ష్యమిస్తున్నాను; నా మరొక సాక్షి నన్ను పంపిన తండ్రి” అన్నారు. వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని తెలుసుకుని ఉండేవారు” అని చెప్పారు. దేవాలయ ఆవరణంలో కానుకలపెట్టె ఉండే స్థలం దగ్గరగా బోధిస్తూ ఈ మాటలను చెప్పారు. అయినా వారెవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు.