యోహాను సువార్త 6:32-40

యోహాను సువార్త 6:32-40 OTSA

యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు. అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది. కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”