యోహాను సువార్త 5:31-47

యోహాను సువార్త 5:31-47 OTSA

“నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. నా పక్షాన సాక్ష్యం ఇవ్వడానికి ఇంకొకరు ఉన్నారు. ఆయన నా గురించి ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు. “మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపినప్పుడు, అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను మనుష్యుల సాక్ష్యాన్ని కోరను కానీ, మీరు రక్షింపబడాలని దీనిని చెప్తున్నాను. యోహాను మండుచూ వెలుగిచ్చే దీపం వంటివాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు. “అయితే యోహాను చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. అదేమిటంటే పూర్తి చేయమని తండ్రి నాకిచ్చిన పనులు అనగా నేను చేస్తున్న పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు. ఆయన పంపినవానిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్యం మీలో నివసించదు. మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకుంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాని జీవం పొందడానికి నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు. “నేను మనుష్యుల మెప్పును అంగీకరించను. అయితే నాకు మీ గురించి తెలుసు. మీ హృదయాల్లో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరట వచ్చాను కాని, మీరు నన్ను అంగీకరించలేదు; అయితే మరొకడు తన సొంత పేరులో వస్తే మీరు అతన్ని అంగీకరిస్తారు. ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు? “నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీరు నిరీక్షణ ఉంచిన మోషేనే మీమీద నేరం మోపుతాడు. మీరు మోషేను నమ్మితే నన్ను కూడా నమ్ముతారు, ఎందుకంటే అతడు వ్రాసింది నా గురించే. కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మకపోతే నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”