యోహాను సువార్త 20:10-18

యోహాను సువార్త 20:10-18 OTSA

తర్వాత ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్లిపోయారు. కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు, తెల్లని బట్టలను ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహాన్ని ఉంచిన చోట తల వైపున ఒకరు కాళ్ల వైపున మరొకరు కూర్చుని ఉండడం చూసింది. వారు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అందుకు ఆమె, “వారు నా ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. వారు ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అన్నది. అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు. ఆయన, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?” అని అడిగారు. ఆమె ఆయనను తోటమాలి అనుకుని, “అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను” అన్నది. యేసు ఆమెను, “మరియ” అని పిలిచారు. ఆమె ఆయన వైపుకు తిరిగి “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో “బోధకుడు” అని అర్థము. యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. నీవు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు. మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, “నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు” అని వారికి చెప్పింది.