అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు. సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు వారు, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు. అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు. ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువైన ఒకడు, “నేను నిన్ను ఒలీవల తోటలో అతనితో చూడలేదా?” అని అడిగాడు. పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది. అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు. కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఇతని మీద ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు, “ఇతడు నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు. పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు. యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది. తర్వాత పిలాతు భవనం లోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు, “అది నీ సొంత ఆలోచనా లేదా ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు. పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేశావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు. అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు. పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఇతన్ని నిందించడానికి తగిన నేరం ఏదీ నాకు కనిపించలేదు. కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కోసం విడుదల చేసే ఆచారం ఉంది కాబట్టి, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.
చదువండి యోహాను సువార్త 18
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను సువార్త 18:24-40
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు