యోహాను సువార్త 18:1-17

యోహాను సువార్త 18:1-17 OTSA

యేసు ప్రార్థించిన తర్వాత తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోకి వెళ్లారు. యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కాబట్టి ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. కాబట్టి యూదా తనతో సైనికుల గుంపును ముఖ్య యాజకులు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో తోటకు వచ్చాడు. యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు. ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. అందుకు, “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు. అందుకు యేసు, “నేనే ఆయనను. ఒకవేళ మీరు నా కోసం వెదకుతున్నట్లయితే వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. “నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు” అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది. అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు. అప్పుడు యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు. అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు. ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే. సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కాబట్టి, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచయం ఉన్న ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువచ్చాడు. ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా?” అని పేతురును అడిగింది. అందుకు అతడు, “కాదు” అన్నాడు.