న్యాయాధిపతులు 6:11-24

న్యాయాధిపతులు 6:11-24 OTSA

యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు. అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?” గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.” యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు. అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి. నేను తిరగి వచ్చి, నా అర్పణ తెచ్చి, మీ ముందు పెట్టే వరకు మీరు వెళ్లకండి.” అందుకు యెహోవా అన్నారు, “నీవు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటాను.” గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు. దేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులియని రొట్టెలను తీసుకుని ఈ రాతి మీద పెట్టి, ఆ రసం దాని మీద పోయి” అన్నాడు. గిద్యోను అలాగే చేశాడు. అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు. అయితే యెహోవా అతనితో, “నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు” అన్నారు. కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.