న్యాయాధిపతులు 2:10-19

న్యాయాధిపతులు 2:10-19 OTSA

ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేసి బయలు దేవుళ్లను పూజించారు. వారు తమను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను తిరస్కరించారు. తమ చుట్టూ ఉన్న జనాంగాల దేవుళ్ళను వెంబడించి పూజించారు. వారు యెహోవాకు కోపం రప్పించారు. వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు. యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు. ఇశ్రాయేలు పోరాడడానికి వెళ్లినప్పుడు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్టు వారిని ఓడించడానికి ఆయన హస్తం వారికి విరుద్ధంగా ఉండేది. వారు ఎంతో బాధపడ్డారు. అప్పుడు యెహోవా న్యాయాధిపతులను పుట్టించారు. కాబట్టి వారు దోచుకునేవారి చేతిలో నుండి వారిని కాపాడారు. అయినప్పటికీ వారు న్యాయాధిపతుల మాట వినక ఇతర దేవుళ్ళతో వ్యభిచారం చేసి వాటిని పూజించారు. యెహోవా ఆజ్ఞలకు విధేయులైన తమ పూర్వికుల మార్గాల నుండి వారు వెంటనే తప్పిపోయారు. యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు. అయితే న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, ప్రజలు ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తూ తమ పూర్వికులకంటే మరి ఎక్కువ చెడు మార్గాల్లో నడిచారు. వారి చెడు విధానాలు, మొండి మార్గాలు విడవడాన్ని తిరస్కరించారు.