యెషయా 29:1-10

యెషయా 29:1-10 OTSA

అరీయేలుకు శ్రమ దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ! సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి పండుగలు క్రమంగా జరుగనివ్వండి. అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది. నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను; గోపురాలతో నిన్ను చుట్టుముట్టి నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది. కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది. ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు. అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు ఒక కలలా ఉంటారు రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు. ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది. నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి. మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి; ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి, మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి. యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు: మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు; మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.

యెషయా 29:1-10 కోసం వీడియో