హెబ్రీ పత్రిక 8:7-13

హెబ్రీ పత్రిక 8:7-13 OTSA

అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు. అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను. ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు. ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.