హెబ్రీ పత్రిక 10:1-23

హెబ్రీ పత్రిక 10:1-23 OTSA

ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కాని నిజ స్వరూపం కాదు. ప్రతి సంవత్సరం అర్పించే అవే బలుల ద్వార అది, ఆరాధించడానికి వచ్చేవారిని పరిపూర్ణులను చేయలేదు. లేకపోతే, వారు బలులు అర్పించడం మానేసేవారు కాదా? ఎందుకంటే ఆరాధించేవారు ఒక్కసారే శుద్ధి చేయబడ్డారు, ఇక అప్పటినుండి వారికి పాపాల గురించి ఇకపై అపరాధ మనస్సాక్షి లేదు. అయితే ఆ బలులు ప్రతి సంవత్సరం పాపాల గురించి వారికి గుర్తు చేసేవిగా ఉండేవి. ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము. అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నాకొక శరీరాన్ని సిద్ధపరచారు; దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, ‘ఇదిగో నేను ఉన్నాను; గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాయబడినట్లు నా దేవా, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను.’ ” ఆయన మొదట ఇలా అన్నారు, “బలులు, అర్పణలు, దహనబలులు, పాపపరిహార బలులను కోరలేదు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి వాటిని బట్టి మీరు సంతోషించలేదు.” తర్వాత ఆయన, “నేను ఇక్కడే ఉన్నాను, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను” అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు. ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము. ప్రతిదినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను పదే పదే అర్పిస్తాడు. అయితే ఈ యాజకుడు పాపాల కోసం అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారిని, ఒకే ఒక బలి ద్వారా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు. పరిశుద్ధాత్మ కూడా దీనిని గురించి మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు: “ఆ కాలం తర్వాత నేను వారితో చేసే నిబంధన ఇదే అని ప్రభువు చెప్పారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” ఇవి క్షమింపబడినప్పడు, పాప పరిహారానికి ఇక బలి అవసరం ఉండదు. కాబట్టి, సహోదరీ సహోదరులారా, యేసు తన శరీరమనే తెర ద్వారా మన కోసం తెరవబడిన సజీవమైన ఒక క్రొత్త మార్గం ద్వారా, యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాము. దేవుని గృహంపైన ఒక గొప్ప యాజకుని మనం కలిగి ఉన్నాము. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.